తస్మాత్ జాగ్రత్త..! రోడ్డు భద్రత మనందరి బాధ్యత
ప్రస్తుతం ధాన్యం రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు రోడ్లపై గుంతలు, గతుకులు ఉండటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కుర్ర రంగ నాయక్ నాని, కుర్ర సాత్విక అమ్ములు విజ్ఞప్తి చేశారు.
ద్విచక్ర వాహనదారులు రద్దీగా ఉండే రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తల్లిదండ్రులు మైనర్లు, చిన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. సరదా కోసం పిల్లలకు వాహనాలు ఇవ్వడం వారి భద్రతకు ముప్పుగా మారవచ్చని, పిల్లల రక్షణ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని గుర్తుచేశారు.
ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కూడా రోడ్డు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ట్రాక్టర్లలో అధిక శబ్దంతో సౌండ్ పెట్టి ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, శబ్దాన్ని నియంత్రించాలని సూచించారు. వెనుక నుంచి అంబులెన్స్ వస్తున్నప్పుడు వెంటనే పక్కకు జరిగి దారి ఇవ్వాలని, అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని తెలిపారు. అంబులెన్స్‌లో ఉన్నది కూడా ఒక మనిషి ప్రాణమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి వాహనదారుడు పోలీసుల నిబంధనలు, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని, తొందరపాటు, నిర్లక్ష్యంతో తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
రోడ్డుపై జరిగే చిన్న పొరపాటు మరో కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చవచ్చని, ప్రతి ఒక్కరి ప్రాణం వారి కుటుంబానికి అమూల్యమైనదని గుర్తుచేశారు. సురక్షిత ప్రయాణంతోనే సంతోషకరమైన జీవనం సాధ్యమని పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, బాలంపల్లి గ్రామానికి చెందిన కుర్ర రంగ నాయక్ నాని, కుర్ర సాత్విక అమ్ములు విడుదల చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)